టొమాటో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తోంది. మరోవైపు రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతుండటంతో టొమాటో రైతులను సంతోషపెడుతోంది. తాజాగా టొమాటోకు కేరాఫ్ గా ఉన్న మదనపల్లి మార్కెట్ లో రికార్డ్ స్థాయి ధరలకు చేరింది. కిలో టొమాటో రూ. 130కి చేరింది. హైదరాబాద్ లో కూడా కిలో టొమాటో ధర రూ. 120-130 మధ్య ఉంది. చెన్నైలో అయితే కిలో టొమాటో ధర రూ. 150 చేరింది.
చెన్నైలో కిలో టొమాటోలకు బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఓ హోటల్ ప్రకటించడం వైరల్ గా మారింది. ఈ ఆఫర్ చూస్తే ప్రస్తుతం టొమాటో డిమాండ్ ఏవిధంగా ఉందో తెలుస్తోంది. పెట్రోల్ ధరలను మించి టొమాటో ధరలు పెరగడం సామాన్యుడికి కంటతడి పెట్టిస్తోంది. ఏ కూర అయినా టొమాటో లేకుండా కాదాయే.. దీంతో టొమాటో ధర ఎంతైనా.. ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు.
తెలుగు రాష్ట్రాల్లో చిత్తూర్, మదనపల్లి ప్రాంతాల్లోనే టొమాటో అధికంగా సాగు చేస్తుంటారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా రాయలసీయ జిల్లాల్లో టొమాటో గణనీయంగా సాగవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు టొమాటోలు ఇక్కడ నుంచి సరఫరా అవుతుంటాయి. అయితే ఇటీివల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా టొమాటో పంట దారణంగా దెబ్బతింది. దీంతో సాగు, దిగుబడి తగ్గడంతో టొమాటోలకు రికార్డ్ ధర లభిస్తోంది.