ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఎలా భాగమైపోయాయో అందరికీ తెలిసిందే. అవి లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రపోయే వరకు స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే ఫోన్లతో మనకు ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటి వల్ల మనకు కలిగే నష్టాల్లో ఒకటి రేడియేషన్. ఫోన్లను ఎంత ఎక్కువగా వాడితే మనం అంత ఎక్కువగా రేడియేషన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ వాడకపోతే ఎలా ? అని అడిగే వారు కొందరు ఉంటారు. అలాంటి వారు ఫోన్ వాడండి. కానీ కింద తెలిపిన కొన్ని సూచనలు పాటిస్తే వారే కాదు, ఎవరైనా కూడా ఫోన్ల రేడియేషన్ బారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. ఫోన్‌ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి. ఆఫీసుల్లో గనక మీరు పనిచేస్తున్నట్లయితే ఫోన్‌ను డెస్క్‌పై ఉంచడం ఉత్తమం. అలాగే అవసరం ఉందనుకుంటేనే ఫోన్‌ను వాడండి. లేదంటే శరీరానికి ఫోన్‌ను దూరంగానే ఉంచాలి. దీని వల్ల రేడియేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
2. కొందరు ఫోన్లకు బ్లూటూత్ లేదా ఎన్ఎఫ్‌సీతో పనిచేసే హెడ్‌సెట్లను వాడుతుంటారు. నిజానికి వాటితో కూడా రేడియేషన్ వస్తుంది. కనుక వీలైనంత వరకు వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్లను వాడడం మంచిది. రేడియేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు.
3. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే.. ఫోన్లను శరీరానికి తగిలేట్లు కాకుండా వాటిని ప్రత్యేక పర్సులలో పెట్టుకోవడం ఉత్తమం. జేబుల్లో కాకుండా పర్సుల్లో పెట్టుకోవడం వల్ల రేడియేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
4. కొందరు నిద్రించేటప్పుడు తల దగ్గరే ఫోన్లను పెట్టుకుంటారు. అలా చేయరాదు. మీరు ఫోన్ వాడకపోయినా సరే దాని నుంచి ఎంతో కొంత రేడియేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఫోన్‌ను తల దగ్గరే పెట్టుకుంటే దాన్నుంచి వచ్చే రేడియేషన్ అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.
5. సాధారణంగా ఫోన్లను చార్జింగ్ పెట్టి ఉంచినప్పుడు వాటి నుంచి అధిక మొత్తంలో రేడియేషన్ విడుదల అవుతుంది. అలాంటి సమయాల్లో ఫోన్ ను వాడాల్సి వస్తే.. చార్జింగ్ తీసి వాడాలి. చార్జింగ్ ఉంచి వాడితే రేడియేషన్ ఇంకా అధికంగా విడుదలై అది మన శరీరంపై ప్రభావం చూపుతుంది.
6. మార్కెట్ లో మనకు యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫోన్లకు వెనుక భాగంలో అతికించడం వల్ల రేడియేషన్ బారి నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు.
7. పిల్లలకు ఫోన్లను అస్సలు ఇవ్వరాదు. ఇవ్వాల్సి వస్తే ట్యాబ్ ఇవ్వండి. వాటిల్లో కూడా సిమ్ లేకుండా చేసి ఇస్తే మంచిది. ఇక గర్భిణీలు ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే కడుపులో ఉన్న బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడుతుంది.