నరేంద్ర మోదీ మనీ ఆర్డర్ పంపితే పోస్ట్ మాన్ గా ఉన్న జగన్ డబ్బులు తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మురళీధరన్. ఇది మేం బయటపెట్టి ప్రచారం చేస్తామన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తించిన తీరు హేయమని.. వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత చర్చ అవసరం లేదు.. కాని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశామని.. సస్పెండైన ఎంపీలు క్షమాపణ చెబితే తిరిగి పార్లమెంటులోకి అనుమతిస్తామని చెప్పామన్నారు.
వైసీపీ, టీడీపీ ఎంపిలు పార్లమెంటులో ఎందుకు నిరసన తెలుపుతున్నారో అర్ధం కాలేదని.. పార్లమెంట్ సజావుగా జరగకూడదని వైసీపీ, టీడీపీ ఎంపీలు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పధకాలుగా చెప్పుకోవడం హాస్యాస్పదమని.. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ అవినీతి పదంలోనే వెళ్తున్నారన్నారు. ఏపీలో ఇసుక, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అవినీతికి పాల్పడుతుందని పేర్కొన్నారు.
రాజధాని విషయంలో ఏళ్ళు గడుస్తున్నా స్పష్టత రాకపోవడం దురదృష్టకరమని.. తుగ్లక్ తరహా పరిపాలన కొనసాగుతుందన్నారు. రాజధానికి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేశారని.. అమరావతి రాజధాని పై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే బిల్లులు వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. జగన్ చంద్రబాబు బాటలోనే అవినీతికి పాల్పడుతూ ఆయన బాటలోనే నడుస్తున్నారని తెలిపారు.