హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచ్చిందని.. 100 పడకల భవనాన్నిఈరోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామన్నారు.
33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటిలోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం మూడో వేవ్ ప్రణాళికతో సిద్దంగా ఉందని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయని వెల్లడించారు. రు. 154 కోట్లతో 900 లకు పైగా ఐసీయూ బెడ్స్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటన చేశారు. వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. 3.96 లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేసామని…రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు.