తెలంగాణలో ముగిసిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఈనెల 14 కౌంటింగ్

-

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగిసింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలు శుక్రవారం సాయంత్రం 4 గంటకు ముగిసింది. ఐదు జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంటో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఇన్నాళ్లు క్యాంపుల్లో ఉన్న కొంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 90 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా కింద కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లల్లో ఒక్కొక్క స్థానానికి మొత్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు.

స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో పోటీ ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ పోలింగ్‌ జరిగింది. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news