జనరల్ బిపిన్ రావత్ ఎక్కడ ఉన్నా, రాబోయే రోజుల్లో, భారతదేశం అభివృద్దిలో ముందుకు సాగడాన్ని ఆయన చూస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. తమిళనాడు చాపర్ క్రాష్‌లో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరియు ఇతరులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ భారతదేశం సంతాపం వ్యక్తం చేస్తోందని.. కానీ బాధలో ఉన్నప్పటికీ భారతదేశం అభివృద్ది ఆగదు, నిలిచిపోదని నరేంద్ర మోదీ అన్నారు. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర యోధులందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నానని..జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటని ఆయన అన్నారు. బిపిన్ రావత్ ధైర్యవంతుడు, దేశం సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డాడని మోదీ అన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతని ప్రాణాలు కాపాడాలని మాతా పటేశ్వరిని ప్రార్థిస్తున్నానని ప్రధాని అన్నారు. దేశం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుందని జవాన్లను కోల్పోయిన కుటుంబాలకు దేశం కూడా అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.