టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ లోని రెండు స్థానాల్లో మొత్తంగా 6 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ దాదాపుగా కైవసం చేసుకుంది. కేవలం అధికార ప్రకటన రావడమే తరువాయిగా ఉంది. ప్రతిపక్షాలకు అందనంత మెజారిటీతో టీఆర్ఎస్ పెద్దల సభ స్థానాలను కైవసం చేసుకుంది.
ఇప్పటికే ఖమ్మంలో తాతా మధు, నల్లగొండలో కోటిరెడ్డి విజయం సాధించాయి. మరోవైపు చాలా మందిని ఆకర్షించిన మెదక్, కరీంనగర్ స్థానాలు కూడా టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమైంది. మెదక్ జిల్లాలో మొత్తం 1018 ఓట్లు ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 762 ఓట్లు సాధించాడు. కాంగ్రెస్ పార్టీ తరుపును బరిలో దిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డిపై విజయం సాధించారు. కరీంనగర్ రెండు స్థానాల్లో భానుప్రసాద్, ఎల్. రమణలు దూసుకుపోతున్నారు. దాదాపుగా వీరిద్దరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కరీంనగర్ లో పోటీ ఇస్తారనుకున్న రవీందర్ సింగ్ అనుకున్నంతగా ఓట్లను సాధించలేదు. మరో వైపు ఆదిలాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. ఇక్కడ ఉన్న మొత్తం 810 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ ఇప్పటికే 738 ఓట్లతో విజయం సాధించారు.