చల్లా రామకృష్ణా రెడ్డి నిజానికి గత కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట. గతంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవి ఆయనకు ఇవ్వజూపితే దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ టీడీపీకి వలసల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యమైన నేతలంతా వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే త్వరలో మరికొందరు కూడా వైకాపా తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. కాగా టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత త్వరలో వైకాపాలో చేరనున్నట్లు తెలిసింది. కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలిసింది.
చల్లా రామకృష్ణా రెడ్డి తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వానికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. ఈ క్రమంలోనే చల్లా త్వరలో వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఆయన జగన్‌ను కలిసి వైకాపాలో చేరుతారని తెలిసింది.
కర్నూల్ జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డికి జనాల్లో మంచి గుర్తింపు ఉంది. అలాగే రెండు, మూడు నియోజకవర్గాల్లో అనుచర గణం కూడా ఉంది. ఆయనకు ప్రజలలో నాయకుడిగా మంచి పేరు ఉంది. కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పలు మార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ ఇప్పుడు ఆయన టీడీపీ వీడితే అది ఆ పార్టీకి ఎదురు దెబ్బే అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే చల్లా రామకృష్ణా రెడ్డి నిజానికి గత కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట. గతంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవి ఆయనకు ఇవ్వజూపితే దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు సివిల్ సప్లస్ పదవి ఇచ్చారు. అయితే తాజాగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీలో చేరేందుకు సిద్ధం కావడంతో… రామకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.
మరోవైపు చల్లా రామకృష్ణా రెడ్డి సొంత నియోజకవర్గం అయిన బనగానపల్లిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయన్ను కాదని చల్లాకు టిక్కెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. అందుకే తనకు టిక్కెట్టు రాదని తెలుసుకున్న చల్లా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చల్లా త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున బనగాన పల్లిలో పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. కాగా 2014 లో కాటసాని రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..!