తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారసుడు వనమా రాఘవ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం సైలెంట్‌గా సెటిల్‌మెంట్లు వ్యవహారం నడిపించిన రాఘవ…ఇప్పుడు ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా రామకృష్ణ అనే వ్యక్తి రాఘవ అరాచకాలు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే… రామకృష్ణ అనే వ్యక్తి ఆస్తి వివాదాన్ని తేల్చమని వనమా రాఘవేందర్ రావు దగ్గరకు వెళ్లారు. అయితే సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన రామకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది. పిల్లలు లేకుండా భార్యతో హైదరాబాద్ రావాలని రామకృష్ణకు రాఘవ డిమాండ్ చేశారు. ఇక ఆస్తి తగాదా గురించి పక్కనబెడితే..రాఘవ వేధింపులు ఎక్కువైపోయాయి. రాఘవ దెబ్బకు మానసికంగా తీవ్ర మనోవేదకు గురయ్యాడు.
ఇక ఏం చేయాలో తెలియక..తన భార్య, తన ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు తాము పెట్రోల్ పోసుకొని సజీవదాహనం చేసుకున్నారు. ఇదే అంశాన్ని ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఇక రాఘవ సైతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఒక వీడియో తీశారు. అసలు తనకు ఏ పాపం తెలియదన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారసుడు అకృత్యాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే కొడుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి వనమా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఈ అంశంపై టీఆర్ఎస్ అసలు స్పందించడం లేదు. ఇక ఈ కేసు నుంచి ఎమ్మెల్యే కొడుకుని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఇక దీనిపై ఎమ్మెల్యే వనమా కూడా స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురిచేసిందని, పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకుని అప్పగిస్తానన్నారు. రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాంతగా జరగాలని, ఇకపై తన కుమారుడిని నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని వనమా చెప్పారు.