ఏపీ ఉద్యోగులకు నిన్న 23 శాతం పీఆర్సీని సిఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బత్తుల అంకమ్మ రావు స్పందించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని… ప్రొబేషనరీని వెంటనే డిక్లేర్ చేయాలని కోరామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ్ జైనుతో సోమవారం సమావేశం కానున్నామని.. 1.34 లక్షల మందిలో అభద్రత ఉందని బాంబ్ పేల్చారు.
జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి బొప్పరాజు మాట్లాడుతూ…. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఓ టైమ్ లైనులో ప్రకటిస్తాం.. పరిష్కరిస్తామని సీఎం చెప్పారని.. ఉద్యోగుల్లో కొంత మేర మిశ్రమ స్పందన వచ్చిందన్నారు. అయినా ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టడం సంతోషమని.. హెచ్చార్ఏ, పెన్షనర్లకు అదనపు పెన్షన్ విషయంపై సీఎంఓ అధికారులతో మాట్లాడామని వెల్లడించారు.
జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి శివారెడ్డి మాట్లాడుతూ.. హెచ్చార్ఏ విషయంలో ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని.. వీలైనంత త్వరగా.. ఉద్యోగులకు సానుకూలంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషనరీని వెంటనే ప్రకటించాలని.. గ్రామ, సచివాలయ ఉద్యోగులకు అందరికీ ఒకే జీతం వచ్చేలా చూడడానికే ప్రొబేషనరీ ప్రకటన విషయంలో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు.