వచ్చే జూన్ లో జరిగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పోటాపోటీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్నంతగా కొన్ని వర్గాలు తలపడనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రావనిలో అంత సీన్ లేకపోయినా, ఎంపిక అనంతరం పరిణామాలు అయితే మారిపోయే అవకాశాలే మెండు. వచ్చే జూన్ లో వైసీపీ తరఫున నలుగురికి రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ సమాయానికి ఖాళీ అయ్యే స్థానాలను నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసేందుకు అధినాయకత్వం పూర్తిగా సమాలోచనలు చేస్తుంది.
ఇందులో భాగంగా ఆశావహుల జాబితా అన్నది చాలా పెద్దగా ఉంది అని తేలిపోయింది. కొత్త ముఖాలకు ఛాన్స్ ఉంది అని కొందరు అంటున్నారు. నలుగురిలో ఇద్దరు కొత్త ముఖాలు అయితే మేలు అన్న వాదన వస్తుంది. కానీ ఆ విషయం ఇప్పట్లో తేలేలా లేదు.
ఈ క్రమంలో వైసీపీలో ఆర్ఆర్ఆర్ గురించి డిస్కషన్ మొదలయింది. మొదట్లో రాజ్యసభకు సంబంధించి సాయిరెడ్డి పేరు మళ్లీ వినిపించింది. ఇప్పటికే ఓ పర్యాయం ఎంపీగా ఉన్నా ఆయన తన టెర్మ్ పూర్తి కానుండడంతో మళ్లీ తనకే అవకాశం అన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇదే సమయంలో రెడ్డి సామాజికవర్గం నుంచి మరో పేరు కూడా వినిపిస్తున్నది.
అదే సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆయన ప్రభుత్వ సలహాదారు. ముఖ్యమంత్రికి ఆప్తులు. ఆయన పేరు బాగానే వినిపిస్తున్నది ఈ రేసులో! వీరి తరువాత మరో ఆర్ .. వైవీ సుబ్బారెడ్డి. ఈయన టీటీడీ చైర్మన్.. ఈయన కూడా ఆశిస్తున్నారు పెద్దల సభకు పోవాలని!
కానీ వీళ్లలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. సాయిరెడ్డిని తప్పించలేనని ఇప్పటికే జగన్ అంటున్నారని సమాచారం. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే అప్పుడు ఛాన్స్ వైవీకి దక్కదు.. సజ్జలనే వరిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వ పెద్ద అనూహ్య రీతిలో పెద్దల సభకు వెళ్లడం, వాయిస్ ఆఫ్ వైసీపీగా నిలవడం ఖాయం కావొచ్చు.. ఇదంతా ఊహా సంబంధితమే! మరి! వాస్తవం ఎలా ఉండనుందో?