తెలంగాణలో టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్న బీజేపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్‌పై పోరాడుతూనే, మరోవైపు రాష్ట్ర స్థాయిలో బలపడటానికి కమలం పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే అంతా బాగానే ఉంది సమయంలో పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. గత కొంతకాలంగా కమలం పార్టీలో చేరికలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ చేరికలు పార్టీకి ప్లస్సే ..కానీ కమలం సీనియర్ నేతలకు కష్టం తీసుకొచ్చాయి.
పార్టీలో వచ్చే కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు గాని, ఎప్పటినుంచో ఉన్న సీనియర్లకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కమలంలోని కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పైగా గత కొన్నిరోజులుగా సీనియర్ నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు ప్రాధాన్యత తగ్గిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా, అసంతృప్తి నేతలు సమావేశం అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వం అలెర్ట్ అయ్యింది. కొందరు నేతలతో పార్టీ పెద్దలు మాట్లాడారని తెలుస్తోంది.
అయితే పార్టీలోని అసంతృప్త వాదులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూ.. తమను పక్కన పెట్టడాన్ని సీనియర్లు ఏ మాత్రం సహించలేకపోతున్నారని, అందుకే వారు ఏకమయ్యే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఇది ఇలాగే కొనసాగితే బీజేపీకే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం గట్టిగానే కృషి చేస్తుందని తెలుస్తోంది.
అదే సమయంలో ఎవరైనా పార్టీ గీత దాటితే వేటు వేయడానికి కూడా వెనుకాడకూడదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో కొంతమంది నేతలపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే పార్టీలో ఉన్న ఆధిపత్య పోరుకు కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రంలో ఆధిపత్య పోరు ఎక్కడ ఉన్నా, దానికి చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తుంది. మొత్తానికైతే కమలంలో సీనియర్లు సీక్రెట్ మీటింగులతో హైలైట్ అయ్యారు.