శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి..వాటిని పరిష్కరించడం అంత సులువు కాదు..
ఆర్థికంగా పెద్దగా కలిసి రాని ప్రతిపాదన ఒకటి జగన్ ఎంచుకున్నారు.ఇప్పటికే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది కలసి రాక అక్కడ అవస్థలు తీరక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా భౌగోళిక సరిహద్దులు తేల్చడం అన్నది అంత సులువు కాదని కూడా అధికారులు చెబుతున్నారు అని ప్రధాన మీడియా అంటోంది. అసలు ఇప్పుడున్న సమస్యలే ఎక్కువ.
ఇవి చాలవన్నట్లు వీటికి తోడు మరో కొత్త సమస్యను ప్రజల ముందుకు తీసుకుని రావడం ఎందాక భావ్యం? వాస్తవానికి కొత్త జిల్లాల ప్రతిపాదనలు చాలా ఉన్నా కూడా వాటిని నెరవేర్చే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేనేలేదని మరోవైపు విపక్షం పెదవి విరుస్తోంది.
రోజుకో వివాదంతో సతమతం అవుతున్న జగన్ ప్రభుత్వాన్ని మరో వివాదం పలకరించనుంది. ఇప్పటిదాకా ఎవ్వరూ కదిపేందుకు కూడా సాహసించని జిల్లాల ఏర్పాటుపై జగన్ ముందుకువెళ్తే పెద్ద యుద్ధమే ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి పరిపాలనా సౌలభ్యం పేరిట కొత్త జిల్లాలు ఏర్పాటుకు మార్గం వెతుకుతున్న జగన్ అందుకు తగ్గ ఏర్పాటు చేయగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్ ను ఒక జిల్లాగా ప్రకటించడంపై కూడా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం లాంటి మారు మూల ప్రాంతాలు కొత్త జిల్లాల రాక కారణంగా నష్టపోతాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు వద్దు కానీ కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తే చాలన్న వాదన కూడా వినిపిస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం జగన్ మరో రెండు రోజుల్లో ఏదో ఒక విషయం తేల్చనున్నారు. ముఖ్యంగా 26 జిల్లాలతో కూడిన నోటిఫికేషన్ రానుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్నీ ఓ జిల్లాగా చేయాలన్న తలంపుతో జగన్ ఉన్నారని సమాచారం.అయితే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సాంకేతికంగా ఎన్నో అవరోధాలు ఉన్నాయి.
వాస్తవానికి నిబంధనలు అన్నవి అస్సలు అనుకూలించేలా లేవు. జనాభా గణన అన్నది పూర్తయితేనే కేంద్రం మార్గ దర్శకాలు అనుసారం వెళ్లాల్సి ఉందని ప్రధాన మీడియా చెబుతోంది. కానీ జగన్ మాత్రం తనదైన పంథాలో వెళ్తున్నారని కూడా వివరిస్తోంది.