దేశాన్ని నడిపించే వారిని మనం అర్థం చేసుకోవడం దగ్గర నుంచి దేశాన్ని నడిపించే శక్తులకు అండగా ఉండడం వరకూ ఎవరికి వారు చేయాల్సినంత చేయాలి. కానీ దేశాన్ని నడిపే శక్తులు ఏం చెబుతున్నాయో వినకుండా, వారిని అదే పనిగా దూషించి తరువాత వారి గురించి విచారించి ఏం లాభం. మోడీ చెప్పేవన్నీ మంచివి కావు కానీ కొన్నిమంచి విషయాలు ఉంటాయి వాటినే తీసుకోండి. వాటితో ప్రయాణించి మంచి మార్పునకు శ్రీకారం దిద్దండి. ఇదీ ఇవాళ్టి విన్నపం.
భరత్ అను నేను అంటూ మహేశ్ బాబు సందడి చేశాడు. బాధ్యత ఉండక్కర్ల అని నిలదీశాడు.bఇప్పుడు మోడీ కూడా మన బాధ్యతల గురించే చెబుతున్నాడు. మన స్వచ్ఛత గురించి ఏకాగ్రత గురించి లక్ష్య దీక్ష గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. కానీ మనం పాటించం. ఎందుకంటే ఆ విషయాలు మనకు అనవసరం కనుక !
ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు వెనుకబడిపోయి ప్రభుత్వాలను అమానుష రీతిలో తిడుతున్నాం. తిట్టడం బాధ్యతగానే భావిస్తే మరి మనం చేయాల్సిన పనులు చేయకుండా తప్పుకు తిరుగుతుంటే దానిని ఎవరు అంగీకరిస్తారు. మనం పనులు మానేసి హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని దేశాన్ని తిట్టడంలో ఏమయినా అర్థం ఉందా?
ప్రజలకు ఇవాళ బాధ్యతారాహిత్యం ఎంతో ఉంది. ఒక వీధి శుభ్రం పై కానీ ఓ ఇంటి శుభ్రం కానీ శ్రద్ధే లేదు. అవును! ఇక్కడ ప్రజలకు ఉమ్మి ఊయడం ఎలానో కూడా నేర్పాలి. బాధ్యత గల పౌరుల కారణంగా బాధ్యత గల దేశం నిర్మాణం సాధ్యం. దేశంలో పాలకులను తిట్టి ప్రజలను ప్రశ్నించకపోవడం మీడియా చేస్తున్న పని. ఆ విధంగా చేయొద్దు గాక చేయొద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా! మళ్లీ ఇందులో వాగ్వాదాలు ఎందుకని.. కనుక ప్రజలకు లేని బాధ్యత పాలకులకు ఎందుకు రావాలి. రాదు. రాదంటే రాదు.
మోడీ అయినా జగన్ అయినా తమ పరిధిలో తాము పనిచేస్తున్నారు. పాలనలో తప్పిదాలను నిలదీసే ప్రజలు అయితే లేరు. పన్నులు సక్రమంగా చెల్లించే ప్రజలయితే అస్సలు లేరు. ఇంకా చెప్పాలంటే వీధి శుభ్రం.. ఇంటి శుభ్రం గురించి మాట్లాడేవారయితే లేరు. మాట్లాడాలి కదా! మాట్లాడాల్సినంత మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి వీళ్లేం సాధిస్తున్నారు.
మాట్లాడితే హక్కులే కాదు బాధ్యతలూ తెలుస్తాయి. మాట్లాడితే బాధ్యతలే కాదు ఇంకొన్నిఅవసరాల ప్రాధాన్యం కూడా తెలుస్తుంది. మన్ కీ బాత్ పేరిట మోడీ మాట్లాడుతున్నాడు. ఇంకా మనం కూడా మాట్లాడాలి. మోడీని నిలదీసేంత లేదా కేసీఆర్ ను నిలదీసేంత లేదా జగన్ ను నిలదీసేంత మాట్లాడాలి. కానీ మనం ఆ విధంగా నడుచుకోం. ఉండలేం కూడా!