టాలీవుడ్లో సమస్యలన్నింటికీ ఈరోజు ఎండ్ కార్డ్ కాదు, శుభం కార్డ్ పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈనేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ నుంచి నాకు ఆహ్వానం ఉందని..ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదని వ్యాఖ్యానించారు. సీఎంతో మీటింగ్ తరువాత అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు చిరంజీవి.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలమీద.. టికెట్ రేట్ల విషయంపై ఈరోజు ప్రభుత్వంతో చర్చించేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ఏపీ సీఎంతో సమావేశం కానున్నారు. సీఎం జగన్ తో భేటీకి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ కూడా హాజరుకానున్నారు. రాజమౌళి, కోరటాల శివ, నారాయణ మూర్తి కూడా సీఎంతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు వెళ్లనున్నారు. గతంలో కూడా చిరంజీవి సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సయమంలో త్వరలోనే అందరికీ సానుకూలమైన నిర్ణయం వస్తుందని వ్యాఖ్యానించారు.