మొన్నటి వేళ కేసీఆర్ పుట్టిన్రోజున రేవంత్ రెడ్డి (టీపీసీసీ చీఫ్) అనుచితంగా ప్రవర్తించారు అన్న విమర్శలున్నాయి.వాటిపై ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి.గాడిదతో కేకు తినిపించడం, ఆ గాడిద మెడలో కేసీఆర్ బొమ్మ ఉంచడం ఇవన్నీ చాలా అంటే చాలా అనుచితంగానే ఉన్నాయి. వీటికి ముందుకు రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఐటీ సెల్ పిండ ప్రదానం చేసింది.
ఆ వేళ వాళ్లు చేసింది కూడా తప్పే! ఈ రెండు చర్యలూ తప్పే! హుందాతనం పోయి మరీ! ర్యాడికల్ సెన్స్లో రాజకీయం చేయాలనుకుంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ కు, టీఆర్ఎస్ కు తేడా ఏముందని? అందుకే కేసీఆర్ మేలుకోవాలి.మాటతో పాటు నడవడి సంబంధిత విధానం వీటన్నింటిపై నియంత్రణ తప్ప కూడదు.ఆయన చెప్పిన మాట ప్రకారం ఇవాళ రాజకీయాలు ఉండవు.ఉండకపోవచ్చు కూడా! అయినా కూడా ఆయన మతి గతి తప్పకూడదు.
ఒకప్పటిలా ఆయన హుందాతనం కోల్పోయి ఉండకూడదు. జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలంటే దృక్పథం ఒకటి బలోపేతం కావాలి. సైద్ధాంతిక రీతికి అనుగుణంగానే రాజకీయం చేయాలి. అందుకు కేసీఆర్ తనకంటూ సొంత రాజ్యాంగం ఒకటి రాసుకోవాలి. స్వీయ నియంత్రణ, ఇతర పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ మెలిగే విధానం తదితర విషయాలన్నింటినీ బుర్రలో పెట్టుకుని రాజకీయం చేయాలి.
రాజ్యాంగం మారుస్తాను మార్చాలి అని అంటున్నారు సరే ముందు కేసీఆర్ తో సహా ఇంకొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటర్నల్ గా చేయాల్సిన మార్పులేవో చేసి, అప్పుడు ఎవరికి వారు సన్నద్ధం అయ్యాక పోరాట పంథా మార్చుకోవాలి. ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేయాలి.
కేసీఆర్ జాతీయ నాయకుడు కావాలని అనుకుంటే తప్పనిసరిగా ఆయన ఆంధ్రాతో కలిసి పని చేయాల్సిందే. ఇష్టం ఉన్నా,లేకున్నా ఆయన ఈ ప్రాంత నాయకులతో పనిచేస్తేనే ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా నిధులు కూడా ఇరు రాష్ట్రాలకూ తీసుకురావచ్చు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత హవా రేపటి కొత్త పార్టీకి రాకపోవచ్చు కనుక కేసీఆర్ ముందు పొరుగుతోనూ, ఇరుగుతోనూ బంధాలు పెంచుకున్నాకే యుద్ధం చేయడం మొదలు పెట్టాలి.