తెలంగాణలో యాసంగిలో వరిని సాగు చేయవద్దని ప్రభుత్వం పలుమార్లు చెప్పింది. కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది. దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని చెప్పింది. చాలా సార్లు సీఎం కేసీఆర్ కూడా ప్రజలను వరి సాగు చేయవద్దని కోరారు. అప్పట్లో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. ఇదిలా ఉంటే వరి సాగు విషయంలో ప్రభుత్వం మాటను పట్టించుకోలేదు రైతులు. మళ్లీ ఈ యాసంగిలో పెద్ద ఎత్తున వరిని సాగుచేశారు.
ఇదిలా ఉంటే వరి సాగులో తగ్గదే లే అంటున్నారు రైతులు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరిని సాగు చేశారు. గతంలో కన్నా 10 శాతం అధికంగానే వరిని పండించారు. రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం 31,01,258 ఎకరాలు అయితే..ఈ యాసంగిలో 34,21,625 ఎకరాల్లో వరి సాగైంది. మొక్కజోన్న 12 లక్షల ఎకరాలకు పెరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. 4.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జొన్న, సెనగ, వెరుశెనగ, మినుము సాధారణం కన్నా ఎక్కవ సాగు చేశారు.