అటు పవన్ ఇటు తారక్ ఇలా ఉంటేనే బాగుంటుంది కానీ తారక్ మాత్రం ఇటు రాను అనే అంటున్నారు..వస్తే బాగుంటుంది అనే కన్నా టీడీపీ బాగు పడుతుంది అని చెప్పడమే మేలు.ఆ విధంగా తారక్ ను బాస్ పిలిచి, పార్టీ పగ్గాలు అప్పగిస్తే చంద్రబాబు అనుకున్న ఫలితాలేవో అన్నీ కాకపోయినా కొన్ని అయినా వచ్చే ఎన్నికల్లో సిద్ధించడం తథ్యం.ఇంకా చెప్పాలంటే అమ్మతోడు ఆయనొస్తేనే పార్టీ బాగుంటుంది మరియు బాగు పడుతుంది కూడా!
పాత తరం వెళ్లి కొత్త రక్తం నింపే సమయం వచ్చేసింది.చంద్రబాబు స్థానంలో మరో కొత్త ముఖం పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధపడితే టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయం.కానీ చంద్రబాబు మాత్రం అందుకు సిద్ధం అవ్వడం లేదు. దీంతో తారక్ ఎంట్రీ పై మళ్లీ అనుమానాలు ఉన్నాయి.ఒకవేళ తారక్ వస్తే చంద్రబాబు దగ్గర ఆయన మాట చెల్లుతుందా అన్న భయం మరియు ఆందోళన కూడా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో తారక్ ఎంట్రీ పై క్లారిఫికేషన్ రోజురోజుకూ లేకుండా పోతోంది.ఒకవేళ ఆయన వచ్చి ప్రచారానికి మాత్రమే పరిమితం అయితే టీడీపీకి పెద్దగా లాభం ఉండదు. కార్యకర్తలను,నాయకులను సమన్వయ పరిచి పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి.
తెలుగుదేశం పార్టీలో దాదాపు సీనియర్లు అంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది సందేహమే! చంద్రబాబు కూడా కొత్త ముఖాల వెతుకులాటలో ఉన్నారు.యనమల లాంటి లీడర్లకు ముందు నుంచి ప్రజా మద్దతు తక్కువే! కనుక ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించిన దాఖలాలే తక్కువ.అయ్యన్న పాత్రుడు కూడా ఈ సారి పోటీచేసినా తరువాత కాలంలో పెద్దగా నిలదొక్కుకునే అవకాశాలే లేవు.ప్రస్తుతం ఆయన కొడుకు విజయ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.ఇదే సమయంలో ఉత్తరాంధ్రకకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు కళా వెంకట్రావు, కిమిటి మృణాళిని, ప్రతిభా భారతి వంటి సీనియర్లు అంతా ప్రస్తుతం అంత యాక్టివ్ గా లేరు. ఆ మాటకు వస్తే విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు కూడా వారసురాలిని ఫోకస్ చేసే పనిలోనే ఉన్నారు.
ఈ దశలో కొత్త రాజకీయం ఆరంభానికి ఇప్పటి నుంచే కొందరు నేతలు పావులు కదుపుతున్నారు.ఆ విధంగా అచ్చెన్న త్వరలోనే తన కుమారుడు కృష్ణ మోహన్ నాయుడిని ఇటుగా తీసుకువచ్చేందుకు యోచిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు వారసులు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ చిన్న కొడుకు గుండ విశ్వనాథ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.దీంతో కొత్త ముఖాలకు కొత్త నాయకత్వం కావాలి. అందుకు తారక్ ను సీన్ లోకి తేవాలని భావిస్తున్నారు కొందరు.కానీ ఆయన మాత్రం ఇటుగా వచ్చేందుకు సుముఖంగా లేరు.ఒకవేళ ఆయన ఎంట్రీ కనుక ఫిక్స్ అయితే తెలుగుదేశం పార్టీకి అన్నీ శుభ శకునాలే!