గురకకూ… ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా? రెండు ఒకటే అనుకుంటున్నారా..!

-

ఈ రోజుల్లో గురక సమస్య ప్రతీ పది మందిలో నలుగురికి ఉంటుంది. దీనివల్ల వారు ప్రశాంతంగా నిద్రపోతారేమో కానీ..పక్కనవారికి మాత్రం నిద్ర ఉండదు. ఇదొక్కటే కాదు..గురక అనేది ఆరోగ్య లక్షణం కాదు..మీ ఇంట్లో వారు తరచూ గురకపెడుతూ నిద్రపోతున్నారంటే..వారు ఆరోగ్యంగా లేనట్లే..అయితే ఇప్పుడు స్లీప్‌ ఆప్నియా సమస్య గురించి సర్వత్రా చర్చమైదలైంది..ఈ రెండు ఒకటే అని కొందరు అనుకుంటే..కాదు వేరు అని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.

అసలు గురక రావడానికి కారణం ఏంటి?

నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్‌ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా రిలీక్స్ అవుతాయి… అలా గొంతు కండరాలు రిలాక్స్‌ కావడంతోనే… అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి… అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్‌ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం.

ఆప్నియా అంటే ఏంటి?

అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్‌ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్‌లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి… ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్‌ అందదు. పైగా అక్కడ కార్బన్‌ డై ఆక్సైడ్‌ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది.

గురకకూ… ఆప్నియాకూ తేడా ఏంటో?

గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ… ఆప్నియా ఉంటే మాత్రం గురక కచ్చితంగా ఉంటుంది. అది ఆరోగ్యపరంగానే కాదు… కుటుంబ బంధాల్లో… ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే… దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్‌ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్‌ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్‌ డెఫిసిట్‌’ అంటారు.

నైట్ సరిగ్గా నిద్రలేకపోతే..తెల్లారి వారు యాక్టీవ్ గా ఉండలేరు. రక్తపోటు పెరగడం, డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్‌ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి.

మంచి జీవనశైలితో మెరుగవుతుందా?

మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చట.. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్‌ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.

ఏ డాక్టర్‌ను కలవాలి?

వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని రకాల పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్‌ స్పెషలిస్టులను లేదా ఈఎన్‌టీ నిపుణులను సంప్రదించాలి.

చికిత్స

స్లీప్‌ టెస్ట్‌ల తర్వాత… తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్‌’ అంటే… ‘కంటిన్యువస్‌ పాజిటివ్‌ ఎయిర్‌–వే’ మెషిన్‌ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్‌టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

కాబట్టి.. గురక అధికంగా వస్తుంటే.. లైట్ తీసుకోకుండా.. తగిన చికిత్స చేసుకోవటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news