మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం భావోద్వేగాల సమాహారం అని సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్‌లో డైరెక్టర్, హీరోలు చెప్పారు. శుక్రవారం విడుదలైన ఫిల్మ్ చూసి ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. పిక్చర్ చూసి ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా హీరోలిద్దరూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అవుతున్నారు.

సినిమా స్టోరిలో భాగంగా స్నేహితులుగా నటించిన రామ్ చరణ్, తారక్ ఒకానొక సందర్భంలో ఫైట్ చేసుకున్నపుడు చూస్తే ప్రతీ ఒక్కరు కంట నీళ్లు పెట్టుకుంటారని ‘ఆర్ఆర్ఆర్’ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఇప్పుడు అది నిజమవుతోంది కూడా. సినిమా చూసిన ఓ పదేళ్లా బాలుడు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి ఏడ్చేశాడు. థియేటర్లో ఇంటర్వల్ సీన్ చూసి బోరున ఏడ్చేశాడు.
రామ్ చరణ్‌ను తారక్ కొడుతుంటే చూడలేక బోరుమని ఏడ్చాడు ఆ బాలుడు. అది చూసిన బాలుడి కుటుంబ సభ్యులు అది సినిమాని, వారిరువురు నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితారని ఓదార్చారు. అలా చెప్పినప్పటికీ బాలుడు మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా రామ్ చరణ్‌ను విలన్ చేశారంటూ రోదించాడు. ఇదంతా వీడియో రికార్డు చేసి ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. యూట్యూబ్‌లోనూ ఈ వీడియో అప్ లోడ్ చేయగా, అది చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. రాజమౌళి సినిమాలో ఎమోషన్స్ ఎలివేషన్స్ అలా ఉంటాయని, ప్రతీ ఒక్కరు ఆ సీన్స్ కనెక్ట్ అవుతారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.