కరెంట్‌ కోతలు.. జగన్‌ సర్కార్‌ కు చంద్రబాబు లేఖ

-

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్ రంగం నిర్వీర్యం అయ్యిందని.. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందించినపుడే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు పురోభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే.. 2019 నాటికి 19160 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం సాధించామని.. దేశంలో మిగులు విద్యుత్ సాధించిన మూడు రాష్ట్రాల్లో ఏపీని నిలిపామని లేఖలో వెల్లడించారు.

నాడు 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండే పరిస్థితి.. ఇప్పుడు ఎందుకు లేదని.. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం ఇందుకు కారణం కాదా..? అని నిలదీశారు. విద్యుత్ సంస్థల పేరిటి తెచ్చిన రూ. 26 వేల కోట్ల అప్పులు ఏమయ్యాయి..? చార్జీల పెంపుతో వచ్చిన 16 వేల కోట్లు ఏమయ్యాయి..? భవిష్యత్ అవసరాల కోసం సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కోతలు, ధరల వాతలకు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత, అవినీతి విధానాలే కారణమని.. విద్యుత్ పీపీఏల రద్దుతో సీఎం, అధికారులు మొండిగా ముందుకు వెళ్లి విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహించారు.

రబీలో బోర్ల కింద సాగవుతున్న పంటలు.. మరో 15-20 రోజుల్లో చేతికొస్తాయని.. ఇలాంటి సమయంలో విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతున్నాయని ఫైర్‌ అయ్యారు. అనంతపురం, చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో ఎండిన పంటలే ఇందుకు సాక్ష్యమని.. అప్రకటిత కరెంటు కోతలతో వ్యవసాయ అనుబంధ రంగాలైన ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే కారణంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది జీవనోపాధి కోల్పోతారని నిపుణులు చెబుతున్నారని.. కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో విద్యుత్ లేకపోవడంతో రెండు రోజుల్లో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. విద్యుత్ సంక్షోభంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news