గండిపేట లో రామ దండు పేరిట మొదట ఆట మొదలయింది టీడీపీ పార్టీకి సంబంధించి.. సినిమా వాళ్ల పార్టీ కదా అలానే ఉంటుంది అని అంతా అనుకున్నారు. ఫస్ట్ షో కాస్త సక్సెస్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. బొమ్మ అదుర్స్ అని అనిపించుకుని ఎన్టీఆర్ కు తిరుగులేని ఆధిక్యంను కట్టబెట్టింది. అధికారాన్ని అందించింది. ఉమ్మడి ఆంధ్రలో ఆయన స్కూల్ నుంచి చాలా మంది వచ్చారు. ఎదిగారు. అప్పటికి ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబు లేరు. ఆ మాటకు వస్తే ఆయన వైఎస్సార్ తో కాంగ్రెస్ లో ఉన్నారు. ఎందుకనో పరిణామాలు బాగా మారిపోయాయి. ఆ విధంగా ఆయన ఇటుగా వచ్చారు. నందమూరి వారింటి అల్లుడు అయ్యారు.
చిన్న వయసులోనే ఎమ్మెల్యే అదేవిధంగా చిన్న వయసులోనే మంత్రి అయిన ఘనతను ఆ రోజు ఆయనే సొంతం చేసుకున్నారు. ఇప్పుడంతా ఆయనను తిరుగులేని నేత అని కొనియాడుతున్నారు. ఆయన కష్టంతో సాధించిన గుర్తింపు వెనుక చాలా రోజుల కాలం దాగి ఉంది. రామారావు హవా తరువాత చంద్రబాబు చరిష్మాకు కూడా తిరుగులేకుండా పోయింది అనేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకు తగ్గ పరిశ్రమ కూడా ఉంది. క్రమశిక్షణ ఉన్న నేతగా చంద్రబాబు పేరు తెచ్చుకోవడమే కాదు..ఎర్రన్నాయుడు లాంటి బీసీ నేతలను ఎంతగానో ప్రోత్సహించారు. కూటమి రాజకీయాలను నడిపేందుకు ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు కూడా !
ఇప్పుడు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఇందుకు ఇవాళే (ఏప్రిల్ 22) శ్రీకారం దిద్దారు. శ్రీకాకుళం నుంచి అనంత దారుల వరకూ ఇవాళ్టికీ చంద్రబాబును అభిమానించే నేతలు కన్నా కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. పదవులు ఆశించే నేతలు కన్నా ఏమీ ఆశించని కార్యకర్తలే అధికంగా ఉన్నారు. అధికారం రాగానే మమ్మల్ని మరువొద్దు అని మాత్రమే విజ్ఞప్తి చేసే కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నేతలు పార్టీ నుంచి తప్పుకునే సమయంలో కూడా కార్యకర్తలే సంక్షోభ సమాయాల్లో
ఉన్నారు. ఆ విధంగా తెలుగుదేశానికి సుశిక్షత సైన్యమే ఉంది.
ఆ రోజు గండిపేట లో రామ దండు ఏ విధంగా పనిచేసేంది ఇవాళ కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని కార్యకర్తలను కోరుతున్నారు చంద్రబాబు. కార్యకర్తలను పట్టించుకోవడంలో చంద్రబాబు ఎంతో వెనకబడ్డారు కూడా ! ఎన్నో తప్పిదాలు చేశారు కూడా ! ఇప్పుడంటే 2 లక్షల రూపాయల బీమా అని అంటున్నారు కానీ చాలా మంది కార్యకర్తలు మృతి చెందినా, సంబంధిత జిల్లా నాయకులు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. సంబంధిత కార్యకర్తలకు నివాళి ఇచ్చిన నాయకులు కానీ అంజలి ఘటించిన నాయకులు కానీ లేరు. వీటిని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు సముచిత, సమున్నత ప్రాధాన్యం అధికారంలో ఉన్నా లేకున్నా ఇచ్చిన రోజే పార్టీ ఉన్నతి అన్నది సాధ్యం అన్నది సుస్పష్టం.