తెలిసి తెలియని వయసు.. తప్పుకు ఒప్పుకు తేడా తెలుసుకోలేక చేసిన పొరపాట్లు.. ఎంతోమంది బాలలను జువైనల్ జైలుకు నెట్టేస్తున్నాయి. బాల్యంలో మదురజ్ఞాపకాలు ఉండాలి కానీ.. జైలు జీవితం తోడవుతుంది. ఆ పసితనం అంతా బానిసల్లా ఉంటే.. ఇక వారు భవిష్యత్తులో ఏం చేస్తారు. సమాజం వారికి ఓ ముద్ర వేస్తుంది. ఇవే ఆలోచనలు చేకూరి సునీతను బాగా కలిచి వేశాయి. చీకట్లు నిండిన ఆ బాలుర జీవితంలో వెలుగులు నింపాలనుకుంది. జువనైల్ జస్టిస్ బోర్డ్’ సభ్యురాలిగా కృషి చేస్తున్న సునీత స్ఫూర్తి ప్రయాణం మనకు కంటతడి పెట్టించకమానదు.
విశాఖ సెంట్రల్ జైల్‌కు దగ్గర్లోనే జిల్లా బాలుర జువనైల్ హోమ్ ఉంటుంది.. వివిధ కేసుల్లో దొరికిన పిల్లల్ని విచారణ నిమిత్తం ఇక్కడ ఉంచుతారు. సునీత ‘ఆసరా ఛారిటబుల్ సొసైటీ’ సేవల్లో భాగంగా నాలుగేళ్ల కిందట అక్కడకు వెళ్లారు ఆమె. 10-15 ఏళ్ల మధ్య వాళ్లు 50 మంది వరకూ ఉన్నారు. మత్తు పదార్థాలు కలిగి ఉన్నారనే ఎక్కుమ మంది అక్కడ ఉన్నారు.. ఎవరో ఆ పొట్లం తెమ్మని చెబితేనో, డబ్బు కోసం ఆశపడో చేశామని ఆ పిల్లలు అంటున్నారు..
జైలు ప్రధాన గేటు విరిగిపోవడంతో పిల్లలెవర్నీ గదుల్లోంచి బయటకు అడుగుపెట్టనీయని పరిస్థితి. ఆ ఇరుకు గదుల్లోనే బాల్యం మగ్గిపోవడాన్ని చూసి…దాతలతో మాట్లాడి రూ.1.3 లక్షల విరాళంతో గేటు నిర్మించారు. ఆపైన చిన్నారుల చదువులకూ, ఆటలకూ ఏర్పాట్లు చేశారు. డ్రాయింగ్ బుక్స్, యాక్టివిటీ కిట్స్ లాంటివీ తెప్పించి.. పిల్లల్లో అపరాధ భావం పోగొట్టి, మార్పు తేవడానికి ప్రయత్నించింది సునీత. వాళ్ల ఆలోచనల్ని మార్చకపోతే మళ్లీ అదేదారిలో వెళ్తారు. అందుకే మంచి చెడ్డల గురించి చెబుతూ… జీవితం ఇంకా చాలా ఉందంటూ సానుకూల దృక్పథంతో ఉండేలా చేయాలనేది సూనీత తపన.
ఈ జువనైల్ హోమ్ లో.. పేదల పిల్లలే కాదు.. ధనికుల పిల్లలు కూడా ఉన్నారట.. ఉద్యోగం, వ్యాపారం అంటూ వారి వారి జీవితంలో బిసీగా గడిపేస్తూ.. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ దారిలో వెళ్తున్నారో గమనించే టైం కూడా లేకపోవడమే వారిని జువైనల్ హోమ్ కు తీసుకొచ్చేలా చేసిందంటున్నారు సునీత.
సునీత పుట్టి పెరిగింది విజయవాడలో. తర్వాత విశాఖలో స్థిరపడి ఎస్‌బీఐలో స్పెషల్ అసిస్టెంట్‌గా చేశారు. సునీతకు గ్రంథాలయాల్లో పిల్లలకు నీతి కథలు, వృద్ధాశ్రమాల్లో పురాణాలు చెబుతుండటం మొదటి నుంచీ అలవాటు. క్యాన్సర్ కారణంగా ఆవిడ చెల్లి చనిపోయారు. దాంతో ఇక సమాజసేవకే అంకితమివ్వాలని నిర్ణయించున్నారు సునీత. 14 ఏళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగ విరమణ చేసి 2014లో ‘ఆసరా ఛారిటబుల్ సొసైటీ’ని ప్రారంభించారు.
‘అవసరం ఎక్కడో ఆసరా అక్కడ’ అంటూ.. పిల్లలూ, మహిళలూ, వృద్ధులూ… ఇలా ఎందరికో ఆమె సాయపడుతున్నారు. కంచరపాలెంలో రైల్వే బ్రిడ్జి కింద ఆకతాయిలుగా తిరుగుతోన్న 150 మంది పిల్లలకు బడి ఏర్పాటు చేసి వాలంటీర్లతో చదువు చెప్పించి వాళ్లంతా బడిబాట పట్టేలా చేసింది.. ఏటా చలికాలంలో అరకు ప్రాంతంలో వందలమంది వృద్ధులకు కంబళ్లనీ పంపిణీ చేస్తారు. కొవిడ్ సమయంలో వందలమందికి రేషన్ సరకులిచ్చారు. ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లనీ అందించారు.
ఎవరి బతుకు వారిది అన్నట్లు ఉన్న ఈరోజుల్లో.. సమాజం కోసం ఇంత చేస్తున్న సునీత ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మనిషిలో మానవత్వం వికసించినప్పుడే.. ఎదుటివారి కష్టానికి మన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మనకు ఉన్నంతలో ఎప్పుడూ సాయంకోసం ఎదురుచూసే వారికి ఎంతోకొంత సాయం చేయడం అలవాటుగా చేసుకోవాలి. కొందరు టెంపుల్ కి వెళ్లి హుండీలో వంద రూపాయలు వేస్తారు కానీ.. అదే టెంపుల్ బయట ఎండలో మెట్లమీద ఉన్న యాచకులకు రూపాయి కూడా వేయకుండా వచ్చేస్తారు. అలా చేయడం ఎంత వరకూ కరెక్టో మీరే ఆలోచించండి..!
-Triveni Buskarowthu