కరోనా మహమ్మారి ధాటికి రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ విద్యాశాఖ. వచ్చే నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. అయితే.. అయితే ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘7’ ఆకారంలో కూర్చోబెట్టే విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా ఈసారి 6 పేపర్లకు కుదించింది విద్యాశాఖ. సైన్స్ సబ్జెక్టులైన జీవశాస్త్రం, భౌతిక శాస్త్రాల పరీక్షలు ఒకేరోజు వేరు వేరుగా నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 940 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు.. చిన్న గదులైతే12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 1,65,683 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు, కరోనా నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.