అన్ని రకాల నేలల్లో.. అన్ని రకాల పంటలు పండవు. ఒక్కో నేల ఒక్కో రకమైన పంటకు అనుకూలంగా ఉంటుంది. రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి పొందాలంటే.. మంచి విత్తనాలు, ఎరువులు వాడటంతో పాటు.. నేల మంచిదై ఉండాలి. అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడటం వల్ల.. భూసారం తగ్గిపోతుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుంది. భూసార పరీక్షల ద్వారా.. పంటకు ఎంత వరకు దిగుబడి వస్తుంది అనేది.. ముందుగానే.. అంచానా వేయొచ్చు.. దాన్ని బట్టి రైతులు ముందుకెళ్లొచ్చు.. దిగుబడి రానిపంటమీద వేలకు వేలు పెట్టుబడి పెట్టడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు కదా..!
భూసార పరీక్షల వల్ల ప్రయోజనాలు..
పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని భూసార పరీక్షల ద్వారా.. తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏ పంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది. మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఏ పంటకు ఏయే మోతాదులో ఎరువులు వేయాలో వాటిని ఎప్పుడు వాడాలో తెలుస్తుంది. పంట పొలాల్లో చౌడు, ఆమ్ల స్ధాయిని నిర్ధారించి సరిచేసేందుకు సరైన పద్దతులను ఎంచుకోవచ్చు.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకునే వీలుంటుంది. భూములలో ఉన్న ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి వాటితో పాటు అధిక దిగుబడికి వేయవలసిన ఎరువుల మోతాదును పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.
భూసార పరీక్షల అధారంగా పంట భూములు నిస్సారమై చెడిపోకుండా పశువుల పెంట, కంపోస్టు, పచ్చిరొట్ట వంటి సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులతో పాటు సమగ్రంగా, సమతుల్యంగా ఏమోతాదులో వాడుకోవాలో అవగాహనకు రావచ్చు.
భూమిలో ఉన్న పోషకాల అధారంగా ఏ పంట వేయాలి, ఎంత మోతాదులో ఎదరువులు వేయాలో పరీక్షల ద్వారా రైతులు ఒక అంచనాకు రావచ్చు. రైతులు ప్రతి ఏటా.. భూసార పరిక్షలను విధిగా చేయించుకోవడం మంచిది. ఖరీఫ్ సీజన్ నుంచే వ్యవ సాయ భూముల్లో మట్టి నమూనాలను సేకరించి అక్కడికక్కడే భూసార పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.