ఈ నెల 6,7 తేదీల్లో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియూ యూనివర్సీటీలో సైతం పర్యటించేందుకు అనుమతులు కోరుతూ.. వీసీకి వినతిపత్రం సమర్పించగా.. నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించారు. దీంతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో సహా 17 మందిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్‌పై టీపీసీసీ రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు రేవంత్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా.. అని ఆయన ఆయన ప్రశ్నించారు. అరెస్టైన విద్యార్థులను కలిసేందుకు వెళితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని అరెస్ట్ చేస్తారా.. అంటూ ధ్వజమెత్తారు. వెంటనే అందరినీ విడుదల చేయాలి.. రాహుల్ గాంధీ గారి పర్యటనకు అందరూ సహకరించాలన్నారు.