తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే.. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దాయ్యాయి. ఎండాకాలం ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగినా.. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రల వద్దకు ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడి వర్షం కురియడంతో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది.
కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. అయితే ఇప్పడు మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది.