తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించమని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఈ సూచనను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలన్నారు. కొవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని, ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
అయితే.. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1,443 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీనితో పాటు ఏపీలోనూ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 9.14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకానున్నారు.