చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ పై తాను సింగిల్‌గా పోటీ చేయలేననే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారని.. చంద్రబాబు బలహీనత మరోసారి ఆయన మాటల్లోనే బయట పడిందని ఫైర్ అయ్యారు. సొంత పుత్రుడి పై నమ్మకం లేక దత్తపుత్రుడిని రమ్మంటున్నారని… నలుగురి భుజాల మీద చేతులు వేసి తాను ముఖ్యమంత్రి అవుదామని చంద్రబాబు ఆశ అని చురకలు అంటించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారని.. ప్రజలు తనను నమ్మటం లేదనే విషయం చంద్రబాబుకు కూడా అర్ధం అయ్యిందని మండిపడ్డారు. ఇవన్నీ పొత్తులు కావు చంద్రబాబు జిత్తులు అని… త్యాగం అంటే ఏమిటి?? అని ప్రశ్నించారు. తాను, తన కొడుకు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తాను అని చెప్పమనండని… చంద్రబాబు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల ముందో, తర్వాతో చంద్రబాబు అనివార్యంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.