గుజరాత్‌లో 24 గంటలూ అన్ని షాపులు తెరిచే ఉంటాయి. వినియోగదారులు ఏ సమయంలో బయటకు వెళ్లినా.. ఏ వస్తువులనైనా కొనుగోలు చేయవచ్చు. ఏ సేవలనైనా పొందవచ్చు.
మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఏ ప్రాంతంలోనైనా సరే షాపులు 24 గంటల పాటు తెరిచి ఉండవు. రాత్రి పూట దుకాణాలను మూసేస్తారు. మళ్లీ తెల్లవారు జామునే వాటిని తెరుస్తారు. మెడికల్ షాపులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప రాత్రి పూట ఏవీ అందుబాటులో ఉండవు. అయితే ఒకపై గుజరాత్‌లో మాత్రం ఎక్కడికి వెళ్లినా 24 గంటలూ షాపులు తెరిచే ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా అక్కడ ఓ నూతన బిల్లును ఆమోదించారు. దీంతో ఇకపై గుజరాత్‌లో 24 గంటల పాటూ అన్ని షాపులు, దుకాణాలు.. అన్ని చోట్ల తెరిచే ఉంటాయి.
గుజరాత్ ప్రభుత్వం షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టుకు మార్పులు, చేర్పులు చేసి ల్యాండ్ మార్క్ బిల్లును తాజాగా ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ గతంలోనే ఆమోదం తెలపగా, తాజాగా రాష్ట్రతి కోవింద్ కూడా ఈ బిల్లును ఆమోదించారు. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో ఈ బిల్లును అమలు చేస్తున్నారు. దీని ప్రకారం.. గుజరాత్‌లో 24 గంటలూ అన్ని షాపులు తెరిచే ఉంటాయి. వినియోగదారులు ఏ సమయంలో బయటకు వెళ్లినా.. ఏ వస్తువులనైనా కొనుగోలు చేయవచ్చు. ఏ సేవలనైనా పొందవచ్చు.
రాష్ట్రంలో ఏటా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకే తాము ఇలా చేశామని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ చెబుతున్నారు. 24 గంటలూ షాపులు, మాల్స్ ఓపెన్ ఉండడం వల్ల మరింత మందికి ఉపాధి లభిస్తుందని, అలాగే వ్యాపార వేత్తలకు కూడా లాభదాయకంగా ఉంటుందని అన్నారు. అందుకనే రిటెయిల్, ఐటీ, హాస్పిటాలిటీ, సర్వీస్ రంగాల్లో మరిన్ని జాబ్‌లను సృష్టించేందుకే ఈ బిల్లును పాస్ చేసి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా 24 గంటలూ అన్ని సేవలను, వస్తువులను పొందవచ్చని తెలిపారు.
కాగా దేశంలోనే ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రం గుజరాత్ కాగా, ఇలా 24 గంటల పాటూ షాపులు, మాల్స్ ఓపెన్ అయి ఉండే రాష్ట్రాలు కూడా ఇప్పటికీ ఏవీ లేవు. అందులోనూ గుజరాత్ ప్రభుత్వం ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఏ రంగంలోనైనా సరే ఉద్యోగులను రోజుకు 9 గంటల కన్నా ఎక్కువగా పనిచేయించుకోకూడదు. అలాగే కనీసం 5 గంటలకు ఒకసారైనా కనీసం 30 నిమిషాల పాటు అయినా బ్రేక్ ఇవ్వాలి. నిరంతరంగా పనిచేయించుకోకూడదు. ఇక మహిళలు ఎక్కువగా పనిచేసే చోట సెక్యూరిటీని పటిష్టంగా ఉంచాలి. ఈ క్రమంలోనే ఇకపై గుజరాత్‌లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, నేషనల్ హైవేలు, రైల్వే ప్లాట్‌ఫాంలు, రాష్ట్ర రహదారులు, బస్ స్టాండ్లు, హాస్పిటళ్లు, పెట్రోల్ పంపులతో సహా.. అన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు ప్రజలకు సేవలు లభిస్తాయి. ఏది ఏమైనా.. గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బిల్లు వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు..!