బీహార్‌లోని గయకు చెందిన శుభం చౌరాసియాది చాలా పేద కుటుంబం. తండ్రి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చౌరాసియా 10వ తరగతి వరకు ఎలాగో కష్టపడి చదివాడు.
కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపన ఉంటే చాలు.. ఏ విద్యార్థి అయినా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. కృషి, పట్టుదల, అంకిత భావం ఉంటే పేదరికం అనేది చదువుకు అడ్డు కాదు. అవును, సరిగ్గా ఈ విషయాన్ని నమ్మాడు కాబట్టే.. ఆ విద్యార్థి కఠోర శ్రమ పడ్డాడు. కష్టపడి చదివాడు. అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్‌లో అద్భుతమైన ఉత్తీర్ణత సాధించాడు. పేదరికంతో బాధపడుతున్నా అది ఆ విద్యార్థి చదువుకు అడ్డం కాలేదు. దీంతో ఆ విద్యార్థి ఇప్పుడు అందరి ప్రశంసలను పొందుతున్నాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరంటే..?
బీహార్‌లోని గయకు చెందిన శుభం చౌరాసియాది చాలా పేద కుటుంబం. తండ్రి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చౌరాసియా 10వ తరగతి వరకు ఎలాగో కష్టపడి చదివాడు. అయితే ఆ తరువాత చదువును అభ్యసించేందుకు అతని తండ్రి వద్ద అంత ఆర్థిక స్థోమత లేదు. దీంతో తన చదువు మానేద్దామని అనుకున్నాడు. కానీ అప్పుడే అతను మగధ్ సూపర్ 30 అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకుల కంట పడ్డాడు. వారు శుభం చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. దీంతో శుభం తన చదువును కొనసాగించాడు.
అలా శుభం చౌరాసియా సదరు కోచింగ్ సెంటర్ సహకారంతో విద్యను అభ్యసిస్తూ ఈ సారి జేఈఈ మెయిన్స్ రాశాడు. అందులో అతను 99.56 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ క్రమంలో శుభం త్వరలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను కూడా రాయనున్నాడు. అందులో ఉత్తీర్ణుడై ఢిల్లీ ఐఐటీలో ఎలాగైనా చేరి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావాలనేదే అతని కల. ఆ కలను అతను నిజం చేసుకోవాలని మనమూ ఆశిద్దాం..!