దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై ఉన్న ఎక్సైజ్ సుంకం తగ్గించి కొంత మంచి చేశారు. ఆ విధంగా ఆయన దేశానికి ఓ మంచి వార్త వారాంతంలో వినిపించారు. ఇదే విధంగా రాష్ట్రాలూ నడుచుకోవాలని తెలుగింటి కోడలు నిర్మల సీతారామన్ హితవు చెప్పారు. అయితే ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ఏటా తాము లక్ష కోట్లు కోల్పోతామని కూడా చెప్పారు నిర్మల సీతారామన్ తమ ట్విట్ లో ! అంటే ఇప్పుడు తగ్గించిన ధరల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్లు నష్టం అని తేల్చడంలో ఉన్న అంతరార్థం ఏంటి ?
పెంచిన ధరలు ఓ వైపు, తగ్గించిన ధరలు ఓ వైపు ఏమయినా తూకం సరిపోతుందా లేదా చెడి ఉందా ? 40 రూపాయలకు పైగా ఎక్సైజ్ డ్యూటీతో సహా ఇతర పన్నుల కలిపి పెంచి, ఇప్పుడు కేవలం పెట్రో పై 9 రూపాయల 5 పైసలు, డీజిల్ పై ఏడు రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామనే మాటను చెప్పడం బీజేపీకే చెల్లుతుందని కాంగ్రెస్ అంటోంది. అదేవిధంగా ఉజ్వల్ భారత్ పథకం కింద గ్యాస్ పొందుతున్న లబ్ధిదారులకు రెండు వందల రూపాయలు తగ్గించారు. ఆ విధంగా సంబంధిత వర్గాలను ఆదుకున్నామని కూడా చెబుతున్నారు. ఇవన్నీ చెబుతూనే మాకు ప్రజలే ముఖ్యం అని దేశ ప్రధాని తన ట్వీట్లో మొదటి మాటగా పేర్కొన్నారు.
ఇక రాష్ట్రాల వాటాగా ఉన్న వ్యాట్ ను తగ్గించేందుకు అటు ఏపీ కానీ ఇటు టీజీ కానీ ఒప్పుకోవడం లేదు. కేంద్రం తగ్గిస్తే తామెందుకు తగ్గించాలని భావిస్తున్నాయి. పెద్దగా ఆదాయాలు లేని తెలుగు రాష్ట్రాలు పన్నుల తగ్గింపునకు అంతగా ఇష్టపడడం లేదు. ఆ మాట నేరుగా చెప్పలేక, తామేం రేట్లు పెంచలేదని, పెంచింది కేంద్రమే కనుక తగ్గించాల్సిందీ కేంద్రమే అని చెబుతూ కొత్త రాగాలు అందుకుంటున్నాయి. ఏదేమయినప్పటికీ ధరలను తగ్గించే క్రమంలో కేంద్రం మరియు రాష్ట్రం ఒక యూనిట్ గా ఉంటూసఖ్యతతో సమన్వయంతో పనిచేస్తే మేలు. కానీ ఇక్కడ పన్నులతో వచ్చే ఆదాయాలను పాలనకు సంబంధించి వాడుకుంటున్నారు కనుక రాష్ట్రాలు ప్రత్యేక ఆదాయ వనరులను తమకు తాముగా పెంపొందించుకోలేకపోతున్నాయి కనుక అస్సలు అంటే అస్సలు వ్యాట్ ను తగ్గించేందుకు తద్వారా పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర్రాల పన్ను వాటా తగ్గించేందుకు ఇష్టపడడం లేదు.