మంత్రి రోజా ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా మద్దతు టీడీపీకి లేదని, చంద్రబాబు ప్రచారానికి ప్రజల నుంచి స్పందనలే లేవని అంటూ వ్యాఖ్యలు చేశారు. మొదట్లో మంత్రి పదవి అందుకున్నాక పెద్దగా మాట్లాడని రోజా ఇప్పుడిప్పుడే రూట్ మార్చారు. గేర్ ఛేంజ్ చేసి టీడీపీకి ఛాలెంజ్ లు విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికీ, లోకేశ్కీ తమ అధినేత జగన్ 70ఎంఎం స్క్రీన్ పై సినిమా చూపిస్తారని అంటున్నారామె ! ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రోజా నియోజకవర్గంలో ఆమె చేసిన లేదా చేయించిన అభివృద్ధి పై ఒక్కసారి ఓపెన్ డిబేట్ పెడితే.. ఎవరు ఏంటి అన్నది తేలిపోతుందని టీడీపీ అంటోంది. తమ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని తమపైనే పంచులు వేయడం బాలేదని అంటోంది.
రోజా అయినా విడదల రజనీ అయినా మాటలు కాదు కదా చెప్పాల్సింది.వైద్యారోగ్యం అప్పగించాక ఆమె చేసిన మంచి ఎంతన్నది? మొదట చర్చకు రావాలి. మంత్రి హోదాలో ఆమె ఇప్పటిదాకా జిల్లాల పర్యటనలకే రాలేదు. కేవలం ఒకట్రెండు ఆస్పత్రులలో తనిఖీలు చేసి, మీడియా ముంగట హడావుడి చేసి వెళ్లిపోవడం తగదు. కనుక అటు రోజా కానీ రజనీ కానీ కీలక శాఖలకు బాధ్యులు. అమాత్య హోదాలో ఉంటూ కేవలం విపక్ష పార్టీలతో తగువులు పెట్టుకోవడంతోనే కాలం వెళ్లదీయడం తగదు గాక తగదు.