పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జేఏసీ చేపట్టిన ఆందోళన అదుపుతప్పి విధ్వాంసానికి దారి తీసింది. అమలాపురం దాదాపు 5 గంటల పాటు అట్టుడికింది. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు… అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు. అల్లర్లు, విధ్వంస ఘటనలతో కరెంట్ కట్ చేయడంతో అమలాపురం అంధకారంలో ఉంది. అయితే.. నేడు కలెక్టరేట్ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో.. అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను బంద్ చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. అమలాపురం ఘటనపై అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు.