తెలంగాణ టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. గ్రూప్-1 విభాగంలో మొత్తం 503 పోస్టులు విడుదల కాగా, రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ పేర్కొంది. నిన్న రాత్రి 10 గంటల వరకు దాదాపు 2,94,644 మంది దరఖాస్తు చేశారని తెలిపింది. ఒక్కరోజులోనే 32 వేల వరకు అప్లికేషన్లు వచ్చినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ రోజు ఆఖరి కావడంతో దరఖాస్తుల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉందన్నారు.
2011లో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1కు 312 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటికి ఏకంగా 3 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేలేదన్నారు. చివిరి నిమిషం వరకు దరఖాస్తులు చేసే అవకాశాలు ఉన్నాయని, సర్వర్ డౌన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది.
ఈ సారి వెలువడిన నోటిఫికేషన్‌లోనూ భారీ స్థాయిలో దరఖాస్తులు పోటెత్తే అవకాశం ఉందన్నారు. కాగా, గ్రూప్-1 యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్ పోస్టుల గరిష్ట వయోపరిమితి, శారీరక దారుఢ్య పరీక్షల అర్హతల్లో మార్పులు జరిగిన విషయం విదితమే. యూపీఎస్సీ నిబంధనలను పరిగణలో తీసుకుని.. అభ్యర్థుల డిమాండ్ మేరకు అర్హతలను ఖరారు చేశారు.