నటి దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ట్విటర్ వేదికగా చెప్పి, ఆ వెంటనే తన ట్వీట్ డిలీట్ చేయడంతో పెను దుమారమే రేగుతోంది. తనని తాను దేవుని చెంత మిక్కిలి విశ్వాసిగా అభివర్ణించుకునే దివ్యవాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పారు. అవన్నీ టీడీపీని అత్యంత ఇరకాటంలో పెట్టేవే కావడం గమనార్హం. తాను చనిపోతే తన శవాన్ని కూడా పార్టీ ఓటు బ్యాంకుకు అనుగుణంగా వాడుకుంటుందని సంచలన రీతిలో వ్యాఖ్యలు చేశారు.
ఓ కళాకారుడు పెట్టిన పార్టీలో ఇంతవరకూ ఏ కళాకారుడూ నెగ్గుకు రాలేకపోయారని జయసుధ దగ్గర నుంచి జయ ప్రద వరకూ అందరి ఉదంతాలూ ఉదహరించి, పార్టీలో తనకు జరిగిన లేదా జరుగుతున్న అవమానాల చిట్టా ఒకటి అదే మీడియా ఎదుట ఉంచి అందరినీ కార్నర్ చేశారు. మహానాడులో తనకు అవమానం జరిగిందని ఇంటికి వెళ్లి ఏడ్చేశానని అన్నారు.
ఇక ఆమె రాజీనామా నిర్ణయంపై కూడా పలు ఊహాగానాలు వచ్చేయి. ఆరోజు అధికారంలో ఉండగా మిగతా నాయకులను నోటికివచ్చిన విధంగా తిట్టిన దివ్యవాణి ఇప్పుడు ఏ విధంగానూ అక్కడ నెగ్గుకు రాలేకపోయారు అని కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఆ పార్టీలో మహిళా నేతలు ఎవ్వరూ రాణించలేరని, రాణించినా ఇమోషనల్ బ్లాక్ మెయిల్ తోనే నెగ్గుకు వస్తారని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. ఏదేమయినప్పటికీ దివ్యవాణి ఎపిసోడ్ అయితే ఇప్పటితో ఆగింది. ఇక నిన్నటి వేళ మహానాడులో చాలా మందికి మాట్లాడే ఛాన్స్ రాలేదు. అయితే వాళ్లంతా పార్టీ వీడిపోతామని అంటున్నారా అని కూడా అంటున్నారు ఇంకొందరు. సీనియర్ లీడర్ చింతమనేనికే అవకాశం లేకుండా పోయిందని, అలాంటిది దివ్యవాణి పెద్దగా ఫీల్ అయిపోవాల్సిన పనేంలేదని అంటున్నారు..టీడీపీ అభిమానులు.