ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగి ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. వరుస పేలుళ్ల కారణంగా కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను నిరోధించేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే ఈవీ బ్యాటరీల విషయంలో బీఐఎస్ ప్రమాణాలు ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీల బీఐఎస్ ప్రమాణాలైన ‘పరిమాణం, స్పెసిఫికేషన్, కనెక్టర్‌లు, సెల్‌ల నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం’ను తప్పని సరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.
దశలవారీగా ఈ పద్ధతిలోనే నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల్లో సైతం అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్లపై పరీక్షించిన మంత్రిత్వ శాఖ.. బీఐఎస్ మార్గదర్శకాలను తీసుకురావడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు బ్యాటరీ తయారీ పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల అగ్ని ప్రమాదాలపై ప్రోబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల అగ్ని ప్రమాదాల్లో బ్యాటరీ సెల్స్, డిజైన్‌లో సమస్య ఉందని, అందువల్లే బ్యాటరీ పేలుళ్లు సంభవిస్తున్నాయని కమిటీ పేర్కొంది.