గత నెల 24 న నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఇంటర్నెట్ సేవలు నిలిచిన కోనసీమ జిల్లాలో డీఆర్డీఏ అధికారులూ మరియు వలంటీర్లూ సంయుక్తంగా కృషి చేసి ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా పింఛన్ల పంపిణీకి సిద్ధం అయ్యారు. సాధారణంగా పింఛను అంటేనే సామాజిక భద్రత కింద భావిస్తారు. ఆ లెక్కన ఈ ప్రాంతంలో ఆఫ్ లైన్ ద్వారా పింఛన్ల పంపిణీకి సిద్ధం అయ్యారు.
ఆన్లైన్ వచ్చాక బయోమెట్రిక్ ద్వారా థంబ్ ను మరోసారి సేకరిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సిబ్బంది జీతభత్యాలు కూడా ఈ సారి ట్రెజరీలో మాన్యువల్ గానే చేయనున్నారు. దీంతో జీతభత్యాల చెల్లింపునకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలను కలెక్టర్ హిమాన్షు శుక్లా వేగవంతం చేయడంతో సంబంధిత విభాగాల్లో సత్ఫలితాలు వస్తున్నాయి.
ఒకటో తారీఖు రాగానే ముందుగా గుర్తుకువచ్చేది పెన్షన్లు. అక్కడి నుంచి సంక్షేమ పథకాల నడవడి, సిబ్బంది జీతభత్యాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చుతో పద్దు మొదలవుతుంది. ఇంటి లాంటిదే రాష్ట్రం కూడా ! ఎవరికీ ఇబ్బంది రానివ్వకుండా ఆర్థికంగా భారం అయినా సరే! ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తలంపుతో ప్రభుత్వం పనిచేస్తోంది. పరితపిస్తోంది. ఈ క్రమంలో వివాదాలు రేగుతున్న విధ్వంసకాండకు ఆనవాలుగా నిలిచిన కోనసీమలోనిన్నటి వేళ 91 శాతం పెన్షన్లు పంపిణీ చేశారు. నిషేధాజ్ఞలు దాటుకుని మరీ ! నిన్నటి వేళ పెన్షన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి నెట్ సర్వీసులు నిలిపివేయడంతో మాన్యువల్ ప్రొసిజర్ కోడ్ కు కలెక్టర్ సమ్మతిస్తూ సంబంధిత వలంటీర్లకూ, అధికారులకూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ పింఛను పంపిణీని పూర్తిచేశారు. కోనసీమ జిల్లాలో రెండు లక్షల 29 వేల 600 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటిదాకా రెండు లక్షల ఎనిమిది వేల 936 మందికి పింఛను అందించారు అని గణాంకాలు చెబుతున్నాయి.