టీఆర్‌ఎస్, కాంగ్రెస్ లపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడైనా సరే… ఏ బాలిక లేదా స్త్రీ ఎవరైనప్పటికీ… అత్యాచారానికి గురికావడమనేది అత్యంత వేదనా భరితమైన పరిణామమని… బయటివారే గాక సొంతవారు సైతం గుచ్చి గుచ్చి చూసే చూపులు, అవమానకరమైన ప్రశ్నలు…. న్యాయం జరుగుతుందో లేదో తెలీదు గానీ ఆ చట్టపరమైన ప్రక్రియల పేరిట జరిగే తంతు… ఇవన్నీ బాధితుల్ని అత్యాచారం కంటే దారుణంగా బాధపెడుతుంటాయని మండిపడ్డారు. కానీ, కులమత భేదాలకు అతీతంగా మేమున్నామంటూ తోడై నిలిచి ఎవరైతే స్వాంతన కలిగిస్తారో… వారే ఆ సమయాన నిజమైన బాధితులకు నిజమైన ఆత్మీయులు అని… అయితే, అత్యాచార బాధితులకు అండగా నిలిచే విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు చాలా లెక్కలున్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు.
దేశంలో ఒక వర్గానికి చెందినవారు ఎప్పుడైనా దురదృష్టవశాత్తు అత్యాచార బాధితులయినట్లయితే నానా హంగామా చేస్తూ… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బీజేపీ సర్కారును తిట్టిపోస్తారు. అదే మరో వర్గానికి చెందిన వారు అత్యాచార బాధితులైతే మాత్రం వారి నుంచి ఏ స్పందనా ఉండదు. గతంలో బులంద్‌షహ్ర్, లలిత్‌పూర్, ఉన్నావ్, అల్వార్, హత్రాస్, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాలకు చెందిన రేప్ బాధితులు, వారి కుటుంబాలను ప్రియాంక, రాహుల్ గాంధీలు నేరుగా కలవడం లేదా ఫోన్‌లో పలుకరించి లేదా ప్రతినిధులను పంపించి ఏదో ఉద్దరించినట్లుగా వ్యవహరించేవారు. ఎందుకు గట్లా అనాల్సి వచ్చిందంటే వీరికి నిజంగా అంత అక్కర ఉంటే దేశంలో ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా అదే స్థాయిలో స్పందించాలని డిమాండ్ చేశారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లోను లేదా ఈ పార్టీ నేతల హస్తం ఉన్నట్టు బయటపడిన అత్యాచార సంఘటనల విషయంలో వారు మాటైనా మాట్లాడరు. అదే బీజేపీ లేదా ఇతర విపక్షపార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ఇలాంటి ఘటనలు జరిగితే ఆ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చెయ్యడం కోసం వెంటనే రంగంలోకి దిగిపోతారు. ఇప్పుడు హైదరాబాదులోని అమ్నీషియా పబ్ ఘటనలో బాధితురాలి విషయాన్నే తీసుకుంటే… ఇంతవరకూ ప్రియాంక, రాహుల్ గార్లు ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే, ఇక్కడి అధికార టీఆరెస్, దాని సయామీ కవల పార్టీ ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు భావజాలపరంగా ఒకే మార్గంలో నడుస్తూ దాదాపు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. మూడూ బీజేపీని వ్యతిరేకించే పార్టీలే కనుక మిగిలిన రెండు పార్టీలనీ ఇబ్బంది పెట్టకూడదనే రాహుల్, ప్రియాంక గార్లు స్పందించలేదని తెలుస్తోంది. అదీగాక, కేసును పక్కదారి పట్టించేలా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే గారిని టార్గెట్ చెయ్యడం చూస్తే నేను చెప్పింది నిజమని స్పష్టమవుతోందని విజయశాంతి స్పష్టం చేశారు.