నిందితులు చెబుతున్న విధంగా సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడికి, సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసానికి సంబంధం ఉందనే తెలుస్తోంది. కానీ నిందితుడి తరఫున ఎవరో కొందరు లాబీయింగ్ చేస్తూ, తమదైన పంథాలో పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న సమాచారం ఉంది. అంతరాష్ట్ర వివాదంగానే ఇది ఉండడంతో తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు అని సమాచారం. ఇక్కడి నాయకుల ఒత్తిళ్లను పట్టించుకోవడం లేదు అనే తెలుస్తోంది. దీంతో కేసు విచారణ ఆలస్యం అయినప్పటికీ ఆధారాల సేకరణ తరువాతే సుబ్బారావు అరెస్టు ఉంటుందని తేలిపోయింది.
సికింద్రాబాద్ అల్లర్లకు కారణం అయ్యాడన్న ఆరోపణలపై నరసరావు పేట సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఈయన్ను స్వస్థలంలోనే విచారిస్తుండగా కొందరు అధికార పార్టీ నాయకులు విడిపించుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈయన్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇంకా పలువురిని అరెస్టులు చేసేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.
ఇవీ ఆరోపణలు
ఘటన ముందు రోజు (ఈ నెల 16) మల్కాజ్ గిరి, మౌలాలి తదితర పరిసర ప్రాంతాల్లో ఉన్న తన విద్యార్థులకు వేర్వేరు మార్గాల్లో భోజనాలు పంపారని, మొత్తం 800 మంది విద్యార్థులకు భోజనాలు పంపి విధ్వంసాన్ని చేయమని ప్రేరేపించాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఇంకా పక్కా ఆధారాలు అయితే పోలీసులు సేకరించ లేదు. వాట్సాప్ గ్రూపులద్వారానే ఈ అల్లర్లకు వ్యూహం రచించారని తెలిసినా కూడా, అందుకు తగ్గ ఆధారాలు అయితే ఇప్పటిదాకా లభ్యం కాలేదు. దీంతో దర్యాప్తును మరింత వేగం చేసి, మరోసారి ఆయన్ను విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. దొరికిన విద్యార్థులలో చాలా మంది సుబ్బారావు అకాడమీలో శిక్షణ పొందిన వారే కావడం గమనార్హం.