తెలంగాణ వాకిట మరో టీ హబ్ ప్రారంభం అయింది. ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో ఈ టీ హబ్ 2.0 ప్రారంభానికి శ్రీకారం దిద్దారు సీఎం కేసీఆర్. దీంతో ఐటీ రంగాన స్టార్టప్ కంపెనీలకు టీ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్టార్టప్ సిస్టమ్ లో ఎందరో యువతకు ఇది ఒక మార్గదర్శకంగా ఉండనుందని చెబుతున్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన టీ హబ్ భవిష్యత్ లో ఎందరికో అండగా ఉండనుందని అంటున్నారు. ఐటీ రంగాన దేశంలోనే నంబర్ ఒన్ రాష్ట్రంగా తెలంగాణను ఉంచాలన్నదే తమ తపన అని అంటున్నారు. ఇదంతా బాగుంది.. పెట్టుబడి రంగంలో యువతకు ప్రోత్సాహం అందించేందుకు కంపెనీలు ఏ మేరకు ముందుకు వస్తాయో అన్నది ఆసక్తిదాయకం.
తెలంగాణ వాకిట ఏర్పాటయిన టీ హబ్ తో మరికొన్ని కంపెనీల ఏర్పాటు సాధ్యమే కానీ స్కిల్ ఓరియెంటెడ్ యూత్ ను కళాశాల స్థాయిలోనే తయారు చేస్తే మరికొందరికి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంబంధిత విద్యా సంస్థలు అప్ గ్రేడ్ కావడం లేదు. అదేవిధంగా చాలా మంది స్టార్టప్స్ పై కనీస అవగాహన కూడా ఉండడం లేదు. బిజినెస్ ఐడియాలను ఎవరికి వారు రూపొందింపజేసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంటే, కొత్తవి కొన్ని వెలుగులోకి వస్తాయి. ఆ విధంగా తెలంగాణ సర్కారు కొత్త కంపెనీలకు మరింత చేయూత ఇచ్చేందుకు టీ హబ్ 2.0 వినియోగపడితే చాలు.
పెట్టుబడులను ఆకర్షించడం, ఆకట్టుకున్న విధంగా ఐటీ రంగాన్ని రూపకల్పన చేయడం, కొత్త ఉపాధి అవకాశాలకు అన్వేషణ చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వంతో పాటే ఐటీ కంపెనీలు కూడా చేయాల్సిన పనులు. అదేవిధంగా కొన్ని స్టార్టప్-లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తుంటే మరికొన్ని ఆవిష్కరణలకూ వీలుంటుంది. అందుకు అనుగుణంగా బిజినెస్ స్టడీస్ కానీ టెక్ సర్వీసెస్ కానీ మారి విద్యార్థి దశ నుంచి కళాశాలలో సంబంధిత తరగతుల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తే మేలు. స్టార్టప్ కంపెనీలు ప్రతిభావంతుల అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తూనే కొన్ని ఎంపిక చేసిన కళాశాలలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు నిర్వహిస్తే మరికొంత మంచి ఫలితాలు వేగంగా అందుకునే వీలు కూడా ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేయించే విధంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తే వేగంగా మంచి ఉన్నతి సాధించేందుకు వీలుంటుంది.