టిఆర్ఎస్ పార్టీకి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రకటన చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈ మేరకు రాజీనామా లేఖను పంపించారు పారిజాత.
బడంగ్ పేట అభివృద్ధి ఆకాంక్షించి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని… అప్పటినుంచి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశానని ఆమె చెప్పారు. క్రమశిక్షణతో పాటు పార్టీ పట్ల అంకితభావంతో తాము సేవలు అందించామని వివరించారు.
అయితే కొంతకాలంగా తమ పట్ల వ్యతిరేక భావనతో ఉండటంతో ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరుతున్నట్లు పారిజాతా నరసింహారెడ్డి వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.