బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోదీ జవాబు చెప్పలేదని, అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించుకున్నారని హరీశ్ రావు మండి పడ్డారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లా మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారని #ModiMustAnswer అనే పేరుతో ప్రధాని మోదీపై మండి పడ్డారు మంత్రి హరీశ్‌రావు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశ, తెలంగాణ అభివృద్ధికి విధాన నిర్ణయమేదైనా ప్రకటిస్తారని ఆశించామని ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ మొండి చెయ్యి ఇచ్చారన్నారు. `గుజరాత్‌కు వరాలు ఇస్తారు. క్రూడాయిల్ రాయల్టీ 763 కోట్లు విడుదల చేశారు. రాజ్‌కోట్‌కు ఎయిమ్స్ ఇస్తారు. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిషనల్ మెడిసిన్‌పై గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు.. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌కు మిషన్ యూపీకింద రూ. 55,563 కోట్లు ఇచ్చారు.
9 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు..కర్నాటకకు తూముకూర్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ, ముంబాయి-బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్టైల్ మెగా క్లస్టర్.. ఇట్లా ఎన్నో ఇచ్చారు. తెలంగాణకూ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికివచ్చే ప్రకటన చేయలేదు` అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెబుతున్నారు మోదీగారు.. మరి గత నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడంలేదు. సీఎంఆర్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నది. దీనివిలువ రూ.22వేల కోట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూలత మోదీ గారు? మా రైతుల ధాన్యం సీఎంఆర్ తీసుకుంటామని సభా వేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించాం.. కనీసం ఊసెత్తలేదు` అని ఆరోపించారు మంత్రి హరీశ్‌రావు.