రాష్ట్రంలో బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేశామని అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ లో వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, మొత్తం 840 బార్ లకు మించి అదనంగా ఒక్క లైసెన్సు కూడా జారీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో ఈ బార్లను సర్దుబాటు చేస్తామని,
డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏపీలో విక్రయించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడుతున్నామన్నారు. కింగ్ ఫిషర్ లోనే 9 బ్రాండ్లు ఉన్నాయని, ఫోస్టర్, హెంకెన్ తదితర కంపెనీలకు ఇతర రాష్ట్రాల్లో సరఫరా ఉంది.. వెంటనే అక్కడ ఆపేసి ఏపీకి ఇవ్వరన్నారు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మద్యం సరఫరాకు సంబంధించి 181 ప్రమాణాల్ని పాటిస్తుందని, ఆదాయం, కొనుగోళ్లు, వేలం తదితర అంశాలపై త్వరలోనే అన్నీ వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు.
మద్యానికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చని, ప్రస్తుతం రాష్ట్రంలో మద్యపానం గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రంలో సేవించే మద్యాన్ని కెమికల్ ల్యాబ్స్ లో పరీక్షించాకే అనుమతి ఇస్తామని తెలిపారు. ఎక్కువ సంఖ్యలోనే నమూనాల్ని పరీక్షించిన తర్వాత విక్రయానికి అనుమతిస్తున్నాం. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లో పారదర్శకత కోసం అంతర్గత ఆడిట్ , బయటి ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. త్వరలోనే కార్పోరేషన్ బోర్డులో చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు రెండు స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమిస్తాం. బోర్డులో ఓ మహిళా డైరెక్టర్ కూడా నియమించాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.