గత వారం రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా.. ఎగువన రాష్ట్రాల్లో సైతం వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలోని జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. అయితే.. ఇప్పుడిప్పుడే.. గోదావరి శాంతిస్తోంది. ఎగువ మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడంతో గోదావరి ప్రవాహం తగ్గుతోంది.
రెండు రోజులుగా క్రమంగా గోదావరి తగ్గుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. రైతులు, పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిర్మల్ జిల్లా సొన్, బాసర, బాదన్ కుర్థి వద్ద గోదావరి ఉధృతి తగ్గుతోంది. మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ప్రవహించిన గోదావరి.. ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే.. మంచిర్యాల జిల్లా లో వాటర్ గేజ్ వద్ద 139మీటర్లు గా నమోదు కావడంతో.. గత రికార్డు లు తిరగరాసింది గోదావరి వరద. వరద తగ్గుతున్నా అది మిగిల్చిన నష్టం అపార మైంది. అతి భారీ వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇదిలా ఉంటే.. కడెంకు భారీగా ఇన్ ఫ్లో తగ్గింది. నీటి మట్టం.679.575/700 వద్ద ఉంది. సామర్థ్యం: 3.421/7.603 టీఎంసీలు కాగా.. ఇన్ ఫ్లో 12298 క్యూసెక్కులుగా ఉంది. అలాగే.. 16 గేట్ల ద్వారా అవుట్ ఫ్లో 13412 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.