రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి వ్యూహాలు తప్పనిసరి…పదునైన వ్యూహాలు పన్ని..ప్రత్యర్ధులని చిత్తు చేయాలి..అప్పుడే రాజకీయంగా విజయాలు అందుతాయి..ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కూడా ఇదే రకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో కమలదళం పనిచేస్తుంది. కేంద్రంలోని పెద్దల సలహాలతో రాష్ట్రంలో బీజేపీ నేతలు…టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
ఇప్పటికే బీజేపీ నేతల యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది..ఎక్కడకక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఎప్పుడు ఒకే రకమైన వ్యూహంతో మాత్రం బీజేపీ పనిచేయడం లేదు…ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కమలదళం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ…కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇక నుంచి మరింత దూకుడుగా వెళ్ళేలా కమలం నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే కేంద్రంలోని పెద్దలు పలు వ్యూహాలు ద్వారా రాజకీయం నడపాలని రాష్ట్ర నేతలకు గైడెన్స్ ఇచ్చారు. ఇదే క్రమంలో రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దల సలహాలతో దూసుకెళుతున్నారు. ఈ ద్విముఖ వ్యూహంలో భాగంగా మొదటగా…తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని చూస్తున్నారు. అసలు తమకు కేంద్రం సాయం చేయడం లేదని, తెలంగాణకు మోదీ సర్కార్ ఓ శని మాదిరిగా తగులుకుందని టీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు.
ఇక ఆ విమర్శలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా..అసలు రాష్ట్రానికి కేంద్రం ఎంత సాయం చేసిందో తెలుసుకోవడానికి బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారు…ఆర్టీఐ చట్టం ద్వారా..రాష్ట్రంలో ఏ పనులకు కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పథకాలలో కేంద్రం వాటా ఎంత అనేది కూడా తెలుసుకుంటున్నారు…కేంద్రం సాయం తెలుసుకుని…వాటిని ఫ్లెక్సిలు రూపంలో పెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇలా చేస్తే టీఆర్ఎస్ పార్టీని మరింత ఇరుకున పెట్టినట్లు ఉంటుందనేది బీజేపీ ప్లాన్.
ఇక ఇందులో రెండో ప్లాన్ వచ్చి..ఇంకా వలసలని షురూ చేయడం…ఇప్పటికే జూలై 27 తర్వాత వలసలు ఉంటాయని ఈటల రాజేందర్ చెప్పిన విషయం తెల్సిందే. అందులో భాగంగా బీజేపీ వీక్ గా ఉన్న పలు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఇతర పార్టీల నేతలని చేర్చుకోవడానికి బీజేపీ రెడీ అయింది. ఈ క్రమంలోనే ఆగష్టు 2న బండి సంజయ్..యాదాద్రిలో చేపట్టే పాదయాత్రలో పలువురు నేతలు బీజేపీలో చేరతారని తెలిసింది. ఈ క్రమంలోనే సినీ నటుడు సుమన్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్, అడ్వకేట్ రచనారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత మోహన్ రెడ్డి లాంటి నేతలు కాషాయ కండువా కప్పుకొనున్నారని తెలుస్తోంది. అయితే ఇంకా రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలని బీజేపీలో చేర్చుకుంటారని తెలుస్తోంది. మరి చూడాలి బీజేపీ ద్విముఖ వ్యూహం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.