నేపాల్‌ క్యాసినోలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు : వర్ల రామయ్య

-

నేపాల్‌లోని క్యాసినోలకు ఏపీ క్యాబినెట్‌లోని సగం మంది మంత్రులు, 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు వెళ్లారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అక్కడ హోటల్‌ మ్యాచీ క్రౌన్స్‌లో వాళ్లు బసచేసిన 27 గదులను ఈడీ తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.


తమ పార్టీ నాయకులు విదేశాల్లో క్యాసినోలకు వెళ్లలేదని సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పగలరా అని నిలదీశారు. మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘క్యాసినో డాన్‌ చీకోటి ప్రవీణ్‌తో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయి.

రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనులు ఇతర మాఫియాల ద్వారా అక్రమంగా సంపాదించిన నల్ల ధనాన్ని క్యాసినో ముసుగులో అధికార పార్టీ నాయకులు నేపాల్‌ తరలించి, అక్కడ తెల్లధనంగా మార్చి తిరిగి మన దేశానికి తెస్తున్నారు. చీకోటి ప్రవీణ్‌ మన దేశంలోనే కాక నేపాల్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలోనూ ‘బిగ్‌ డాడీ’ పేరుతో క్యాసినోలను నడిపారు. ప్రవీణ్‌తో కలిసి కొడాలి నాని, వల్లభనేని వంశీ అనేక సార్లు నేపాల్‌ వెళ్లారు’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. త్వరలోనే అధికార పార్టీ పెద్దల బండారాన్ని ఆధారాలతో బయటపెడతామని చెప్పారు.

“గుడివాడ క్యాసినోవల్ల ఎంతోమంది రూ.కోట్లు పోగొట్టుకుని రోడ్డునపడ్డారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇందులో వైకాపా పెద్దలకు వాటా ఉంది కాబట్టే చర్యలు తీసుకోలేదు. చీకోటి ప్రవీణ్‌ బాగోతం బయటికొచ్చాక చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ పెద్దల పిల్లలు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఎన్‌ఐఏ అధికారులతో కలిపి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబాల్‌ పర్యవేక్షణలో సిట్‌ను ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news