ఎందరో మహానుభావులు చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో నేడు 82వ స్నాతకోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ మేరకు ఓయూ వీసీ రవీందర్ మాట్లాడుతూ.. ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గం టలకు ఈ వేడుక ప్రారంభం కానున్నదని తెలిపారు. అంతేకాకుండా.. ఈ వేడుకుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు వీసీ రవీందర్. ఓయూ గెస్ట్‌హౌజ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్‌లతో కలిసి వీసీ మాట్లాడారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని ఇస్తారని వీసీ రవీందర్ వెల్లడించారు. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న 48వ వ్యక్తిగా ఎన్వీ రమణ నిలుస్తారని చెప్పారు వీసీ రవీందర్.
ఇప్పటి వరకు లా విభాగంలో 29, సాహిత్యంలో 12, సైన్స్‌లో 6 గౌరవ డాక్టరేట్‌ల ను ఓయూ ప్రదానం చేసినట్టు గుర్తు చేశారు వీసీ రవీందర్. వారిలో 18 మంది ప్రముఖులు, ఎనిమిది మంది రాజ కుటుంబీకులు, ఆరుగురు విదేశీ ప్రముఖులు, నలుగురు జాతీయ నాయకులు, నలుగురు న్యాయమూర్తులు, ముగ్గురు రాష్ట్రపతులు, ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు కవులు ఉన్నారని వివరించారు వీసీ రవీందర్. అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య పరీక్షలు పాసైన వారికి మాత్రమే పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తామన్నారు. మొత్తం 55 బంగారు పతకాలను 31 మంది విద్యార్థులు గెలుచుకున్నారని, వారిలో నలుగురు అబ్బాయిలు కాగా, 27 మంది అమ్మాయిలు కావడం విశేషమన్నారు. 260 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 96 మంది పురుషులు కాగా, 143 మంది మహిళలుగా పేర్కొన్నారు వీసీ రవీందర్.