అగ్గిపుల్లతో దీపారాధన చేస్తున్నారా.. దీపం ఏ దిశలో ఉంటే ఫలితం ఉంటుందో తెలుసా..?

-

దీపం జ్యోతి పరంబ్రహ్మ అంటారు అంటే దీపం ప్రాణానికి ప్రతీక అని అర్థం. అంతేకాదు ఆ పరమాత్మకు ప్రతిరూపం. మనం ఇంట్లో దీపం వెలిగిస్తున్నామంటే.. ఆ పరమాత్ముడిని ఆ వెలుగులో కొలుస్తామన్నమాట. ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తే ఇళ్లంతా ఎప్పుడు ప్రశాంతంగా.. అష్టైశ్వర్యాలతో.. ఆయురారోగ్యాలతో వెల్లివిరుస్తుందని అంటుంటారు. అయితే మీరు దీపం ఎలా వెలిగిస్తున్నారు.. అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తున్నారా.. వెలిగించిన దీపాన్ని ఏ దిశలో ఉంచుతున్నారు.. ఈ విషయాలు తెలుసుకోండి..

మనం పూజ చేసేటప్పుడు దీపం ఎందుకు వెలిగిస్తామంటే.. దేవుడిని ఆరాధించే కంటే ముందు ఆ దేవుడి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. దీపం-ధూపం-నైవేద్యం అనేవి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన ఉపచారాలు. దీపారాధన సమయంలో ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసుకుందామా..

మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదని చెబుతారు.

కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. ఏక హారతితో కానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి.

ఒకవత్తితో దీపం పెట్టకూడదు. ఎందుకంటే అది కేవలం శవం వద్ద వెలిగిస్తారు.

దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు.

తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు

పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.

ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి.

దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.

“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించారంటే.. మూడు లోకాల చీకట్లను పోగొట్టే దీపాన్ని వెలిగించినట్లు అర్థం. దీపం వెలిగించిన తర్వాత మనం మొక్కుతాం ఎందుకంటే.. భయంకరమైన అంధకారం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరించాలి కాబట్టి. ఇక మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం.

దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం అని పండితులు చెబుతారు.

Read more RELATED
Recommended to you

Latest news