లైగర్ సినిమా ఎందుకు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిందో వివరించారు ప్రముఖ ఫిల్మ్ట్రేడ్ అనలిస్ట్ కరన్ తౌరాని. ఈ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్స్ ఎంత వస్తాయో అంచనా వేశారు. ఆ వివరాలు.
‘వెయ్యికోట్లు పక్కా’, ‘రూ.200 కోట్లా.. ఇది చాలా తక్కువ, ఇండియా షేక్ అవుతది’ ఈ వ్యాఖ్యలు దాదాపుగా ప్రతీ సినీప్రేక్షకుడికి గుర్తుండే ఉంటాయి. ‘లైగర్’ సినిమా కలెక్షన్స్‌ను ఉద్దేశిస్తూ.. మొదటిది దర్శకుడు సుకుమార్ అనగా, రెండోది హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ మాటలే మీమ్స్ రూపంలో తెగ కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ అంచనాలతో విడుదలైన రౌడీహీరో లైగర్ మూవీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ పరంగా కూడా బాగా నిరాశపరిచింది. దీంతో ఈ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కరన్ తౌరాని(karan taurani) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలి రోజు వసూళ్లను, టాక్‌ను ఆధారంగా చేసుకుని.. మొత్తంగా ఈ చిత్రం రూ.55 నుంచి 60కోట్లు మాత్రమే వసూలు చేస్తుందని అంచనా వేశారు. అందులో రూ.10కోట్లు బాలీవుడ్ నుంచి వస్తాయని అన్నారు.
“సినిమా రిలీజ్ కాకముందు ఈ చిత్రం లైఫ్‌టైమ్ కలెక్షన్స్ రూ.170-180కోట్లు సాధిస్తుందని, అందులో 25శాతం బాలీవుడ్ బాక్సాఫీస్ నుంచి వస్తుందని అంచనా వేశాం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ లైఫ్‌టైమ్ ఫిగర్ రూ.55-60కోట్లు మాత్రమే వసూళ్లను అందుకుంటుందని తెలుస్తోంది. మంచి కంటెంట్, రియలిస్టిక్ వీఎప్ఎక్స్ ఉంటేనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంటాయి. ఇండస్ట్రీ కంటెంట్ విషయంలో మార్పులు చేసుకుంటేనే కష్టాల్లో నుంచి బయటపడుతుంది. ఎందుకంటే ఎలాంటి కంటెంట్ ఉన్న చిత్రాన్ని థియేటర్లో చూడాలనే విషయమై ప్రేక్షకులు స్పష్టతతో ఉన్నారు” అని కరన్ అన్నారు.
కాగా, బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమాను దర్శకుడు పూరిజగన్నాథ్ తెరకెక్కించారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ, దిగ్గజ బాక్సర్‌ను కీలక పాత్ర పోషించారు. సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్ భాగ్చి సంగీతమందించారు. సినిమాటోగ్రఫీ- విష్ణు శర్మ, ఎడిటింగ్- జునైద్ సిద్ధిఖీ. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని రూపొందించారు.